దసరా శరన్నవరాత్రులు(Dasara)

Dasara Navarathri (దసరా నవరాత్రిలు)

 ప్రతీ సంవత్సరం ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని నవమి వరకు దేవీ నవరాత్రులు అని అంటారు. ఈ 9రోజులు దుర్గాదేవిని వివిధ రూపాలతో అలంకరించి హిందువులు అత్యంత భక్తి శ్ర్రద్దలతో అమ్మవారిని పూజిస్తారు.ఆశ్వీయుజ మాసం నుండి వర్ష ఋతువు వెళ్ళి, శరత్ ఋతువు ప్రారంభం అవుతుంది కనుక నవరాత్రులను శరన్నవరాత్రులు అని కూడా అంటారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు.

నవరత్రుల సమయంలో అమ్మవారి అలంకారములు :
1. బాలాత్రిపుర సుందరీదేవి
2.గాయత్రీ అమ్మవారు
3.అన్నపూర్ణాదేవి
4.లలితా త్రిపురసుందరి
5.సరస్వతీదేవి (మూలా నక్షత్రం వచ్చినప్పుడు)
6.మహాలక్ష్మి
7.దుర్గాదేవి
8.మహిషాసుర మర్ధిని
9.రాజరాజేశ్వరీ అమ్మవారు

విజయదశమి:- మహిషాసురుడు దేవేంద్రుని ఓడించి, దేవలోకానికి అధిపతి అయ్యాడు. ఆ రాక్షసుడు పెట్టే హింస భరించలేక దేవతలు త్రిమూర్తులతో మొర పెట్టుకున్నారు. దాంతో మహిషాసురుని మట్టు పెట్టేందుకు త్రిమూర్తులు ఒక దివ్యశక్తిని సృష్టించారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల నుండి వెడలిన మహోజ్జ్వల శక్తి ఒక మహా శక్తిగా అవతరించింది. ఆ దివ్య మంగళ రూపానికి మహాశివుడు శూలాన్ని, విష్ణువు చక్రాన్ని, బ్రహ్మ అక్షమాలను, కమండలాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, వరుణుడు పాశాన్ని, హిమవంతుడు సింహవాహనాన్ని ఇచ్చారు. ఇక ఆ మహాశక్తి దేవతలను పీడిస్తున్న మహిషాసురునితో తొమ్మిది రోజులపాటు యుద్ధం చేసి, చివరికి సంహరించింది. మహిషాసురుని వధించింది కనుకనే, మహిషాసురమర్దిని అయింది. మహిషాసురుని పీడ విరగడవడంతో ప్రజలు సంతోషంగా ఉత్సవం జరుపుకున్నారు. అదే విజయదశమి పర్వదినం.

అమ్మవారు మహిషాసురుడుని సంహరించి, దుష్ట సంహారం చేసి సాధించిన విజయానికి గుర్తుగా దశమి తిధి నాడు విజయదశమిగా జరుపుకొంటారు.ఈ విజయదశమికి ఉత్తరాది వారు రాముడు రావణుడి ఫై విజయం సాదించి దుష్ట సంహారం చేసి, సీతమ్మను తిరిగి అయోధ్యకు తీసుకువచ్చిన వచ్చిన సందర్బానికి గుర్తుగా రావణుడి బొమ్మను కూడా దగ్దం చేసి ఈ పండుగను జరుపుకొంటారు.

పాండవులు 12ఏళ్ళు వనవాసం, 1 ఏడు అఙ్ఞాతవాస కాలం లో తమ ఆయుధాలను జమ్మి వృక్షం ఫై వుంచి,తిరిగి అఙ్ఞాతవాసం తర్వాత జమ్మి వృక్షమునకు పూజ చేసి ఆయుధాలను ధరించారు.కాబట్టి చాలా ప్రాంతాలలో ఈ రోజున ఆయుధపూజ ని చేస్తారు. కొన్ని ప్రాంతాలలో జమ్మి ఆకులను కూడా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకొంటారు.