పుష్కరస్నానం ఎలా చేయాలి ?

Brahmasri Chaganti Koteswara Rao-Garu

సనాతన సంప్రదాయంలో స్నానం అత్యంత ప్రధానమైన ఆచారం. భగవంతుడి విభూతిని సంతరించుకోవటానికి అత్యంత ప్రధానమైన ఉపకరణం. అందుకే స్నానం చేసే సమయంలో కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. పుష్కర స్నానానికి ఇంటి నుంచి బయలుదేరే సమయంలో..  ‘‘సర్వదా సర్వదేదేశూ పాపుత్వాం భువనేశ్వరీ మహామాయా జగత్‌ధాత్రీ సచ్చిదానంద రూపిణీ’’ అని అమ్మవారికి నమస్కారం చేసి బయలుదేరాలి. పుష్కర స్నానం ఆచరించడానికి వెళ్తున్న మాకు ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా చూడు తల్లీ అనేది ఈ ప్రార్థన ఉద్దేశం. ఇంటి నుంచి బయల్దేరేటప్పుడే చిటికెడు మృత్తిక (మట్టి)ను ఓ కాగితంలో చిన్న పొట్లం కట్టి వెంట తీసుకెళ్లండి.
ఇక నదిలోకి దిగిన తర్వాత వీలైతే కూర్చోవాలి. నీళ్లు తీసుకొని, శిరస్సు మీద మూడు పర్యాయాలు.. పుండరీకాక్ష అంటూ చల్లుకోవాలి. ఆ తర్వాత ఆచమనం చేయాలి. సంకల్పం చెప్పుకోవాలి. ఇంటి నుంచి తెచ్చిన మృత్తికను చేతిలో ఉంచుకుని..

పిప్పలాదాత్సముత్పన్నే
కృత్యేలోక భయంకరి
మృత్తికాంతేమయాదత్తా
మహారార్ధం ప్రకల్పయ

 అన్న శ్లోకం చదివి ఆ మట్టిని నదిలో వదిలివేయాలి. ఆ తర్వాత నదిలోపలికి ప్రవేశించి- మూడుసార్లు తల మునిగేటట్లు స్నానం చేయాలి. పుష్కర స్నానం చేసే సమయంలో పక్కవారితో మాట్లాడకూడదు. శ్రీమాత అనే నామస్మరణ చేస్తూ గోదావరి స్నానం చేయాలి. గోదావరిని భ్రమరాంబగా, కనకదుర్గగా.. ఇలా 108 రూపాలతో కొలుస్తారు. ఈ నామాలను ఎటువంటి దోషాలు లేకుండా జపం చేస్తూ స్నానం చేస్తే చాలా మంచిది. ఇక గోదావరికి చేసే పూజలో- గంధము, అక్షతలు అనే రెండు ఉపకరణాలను తప్పనిసరిగా వాడాలి. ఇంటి దగ్గర చందనం అరగదీసి.. దానిని తమలపాకులో పెట్టుకొని స్నానం చేసే సమయంలో పట్టుకువెళ్తే చాలా మంచిది. ఇదే విధంగా మంచి బియ్యాన్ని తీసుకొని- దానిని స్నానానికి వెళ్తే ముందురోజు ఆవుపాలు, ఆవునేయి, పసుపులతో కలిపి ఉంచాలి. ఆ అక్షతలను తీసుకువెళ్లి గోదావరికి సమర్పిస్తే ఆమె సంతోషిస్తుంది. మన సనాతన సంప్రదాయం ప్రకారం గోదావరిని భ్రమరాంభగా కొలుస్తారు. ఆదిగురువు శంకరులు భ్రమరాంభాష్టకంలో ఈ విషయాన్ని వెల్లడిస్తారు. ఇక స్నానం పూర్తయిన తర్వాత దేవతలకు, పితృదేవతలకు తర్పణం ఇచ్చి, అర్ఘ్యం ఇవ్వాలి. ఇక్కడ పిండ ప్రదానం చేసేవారు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. పిండప్రదానం చేసిన తర్వాత ఇంటికి వచ్చే ముందు స్నానం చేసి రావాలి. స్నానం చేసినప్పుడు నియమాలను పాటించటంతో పాటుగా.. కొన్ని పనులను చేయకూడదు. స్నానం చేసే సమయంలో ఎటువంటి పరిస్థితుల్లోను నీటిని కాలితో కానీ చేతితో కాని తన్నకూడదు. ఆటలు ఆడకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో-మలమూత్ర విసర్జన చేయకూడదు. దిగంబర స్నానం కూడా నిషిద్ధమే. వీటిన్నిటినీ పాటిస్తూనే పుష్కర స్నానం చేయాలి.

దిగంబర స్నానం మహాదోషం!
ఒంటిమీద బట్టలు లేకుండా స్నానం చేస్తే, నీటికి అధిదేవత అయిన వరుణిడికి ఆగ్రహం కలుగుతుంది. ఈ విషయం భాగవతం దశమస్కంధంలో ఆవిష్కృతమవుతుంది. గోపికలందరూ కాత్యాయనీ వ్రతాన్ని ఆచరించటానికి నదీ స్నానానికి వెళ్తారు. అక్కడ వివస్త్రలై స్నానాలు చేస్తారు. ఈ విషయాన్ని గ్రహించిన కృష్ణుడు.. గోపికల బట్టలను తీసుకొని ఒక చెట్టుకొమ్మపై కూర్చుంటాడు. అప్పుడు గోపికలు, తమ బట్టలను తిరిగి ఇవ్వమని కృష్ణుడిని వేడుకుంటారు. అప్పుడు కృష్ణుడు.. ‘గొపికల్లారా! మీకు తెలియకుండా ఒక తప్పు చేశారు. వివస్త్రలై నదీ స్నానం చేసి వరుణుడికి కోపం తెప్పించారు. వరుణుడి ఆగ్రహం పోతే తప్ప మీ వ్రతానికి ఫలితం ఉండదు. ఫలితం దక్కకపోవటం వల్ల మీరు దైవనింద చేసినా ఉపయోగం ఉండదు. దీనికి ప్రాయశ్చితం దైవాన్ని చేతులు ఎత్తి ప్రార్థించటమే..’ అని వివరిస్తాడు. అప్పుడు గోపికలు రెండు చేతులు నుదుటికి తాకించి కృష్ణుడిని ప్రార్థించి నమస్కరిస్తారు. దీనితో వారికి ఆ దోషం తొలగిపోతుంది.

మీదర్మ సందేహాలను మాకు askguru@bhakthishakthi.com కి Email చేయండి.